వేమన నీతి పద్యాలు 1-10 | యోగి వేమన శతక పద్యాలు

వేమన నీతి పద్యాలూ

వేమన పద్యాలూ :

1వ పద్యం

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ

భావం –

ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు అతికించవచ్చు.కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే(అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుంటే)దానిని మరళా అతికించుట ఆ బ్రహ్మ దేవిని వల్ల కూడా కాదు.

2వ పద్యం

మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వ దాభిరామ! వినుర వేమ!

భావం –

అత్తిపండు పైకందముగా కనపడుతుంది. దానిలోపల పురుగులుంటాయి. అదే విధముగ పిరికి వాని ధేర్యము కూడా పైన పటారము లోన లోటారముగ ఉంటుంది

3వ పద్యం

పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టేనేని బిగియ బట్టవలయు
బట్టివిడుచుకన్న బరగ జచ్చుటమేలు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం –

పట్టుదలయే వహింపరాదు. వహించినచో ఆ పట్టు వదలరాదు. పట్టినపట్టు నడిమిలోనే విడచుటకంటే మరణము మేలు.

4వ పద్యం

అనువుగాని చోట అధికుల మనరాదు,
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా,
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం –

విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదుగకా.

5వ పద్యం

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోనిపోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం –

చెప్పులో ఉన్నరాయి, చెవిలో దూరిన జోరీగ, కంటొలోపడిన నలసు కాలిముల్లు, ఇంటిలోని జగడం వెంటనే తగ్గక చాలా బాధిస్తాయి.

6వ పద్యం :

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం –

మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడా విత్తనము చిన్నదేకదా!

7వ పద్యం :

నిక్క మైన మంచినీల మొక్కటి చాల
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం –

తట్టెడు గులకరాళ్ళ కంటే ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల కంటే ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.

8వ పద్యం :

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ

భావం –

ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు.అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం ఎమనగా సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)

9వ పద్యం :

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ

భావం –

పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.

10వ పద్యం :

ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ

భావం –

మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధ అని వేమన భావన)

ఇవి కూడా చూడండి :

నీతి పద్యాల లిస్ట్     వేమన పద్యాలు 11-20     వేమన పద్యాలు 21-30     ఆసక్తికరమైన క్విజ్ లు     సనాతన ధర్మ మూలాలు    భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *