వేమన నీతి పద్యాలు 11-20 | వేమన శతక పద్యాలు

వేమన నీతి పద్యాలూ

వేమన శతక పద్యాలు :

11వ పద్యం

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ

భావం –

ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.

12వ పద్యం

గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ

భావం –

కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.

13వ పద్యం

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం –

ఎంతో విలువయిన బంగారం శబ్ధం అంత విలువ లేని కంచు కంటే ఎలా తక్కువగా ఉండునో అలాగే మంచి వాని మాటలు చాలా చల్లగా నిరాడంబరంగా ఉంటే చెడ్డ వాని మాట మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.

14వ పద్యం

ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ

భావం –

ఆపదల్లొ చిక్కుకున్నపుడు సహాయపడేవాడే భందువు.భయముతో ఉన్నపుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు.కటిక బీదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య.

15వ పద్యం

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ

భావం –

ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది.నీటిలోన పడిన చినుకు వ్యర్ధం అవుతుంది.అలాగే ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం అదే వస్తుంది.

16వ పద్యం

చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ

భావం –

అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది.అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.

17వ పద్యం

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం –

పూజపునస్కారముల కంటే బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.

18వ పద్యం

రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె
ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం –

రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి

19వ పద్యం

తామసించి చేయఁదగ దెట్టికార్యంబు
వేగిరింప నదియు విషమెయగును
పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన,
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం –

కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా!

20వ పద్యం

నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం –

నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడా జయింస్తుంది. కాని బయట కుక్కను కూడా ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు.

ఇవి కూడా చూడండి :

నీతి పద్యాల లిస్ట్    వేమన పద్యాలు 1-10     వేమన పద్యాలు 21-30    సుమతీ శతక పద్యాలు    భాగవతం పుస్తకాలూ    తెలుగు సంవత్సరాలు     సకలదేవత స్తోత్రాలు 

సనాతన ధర్మ మూలాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *