శ్రీకాళహస్తేశ్వరా శతకం దాశరధీ పద్యం

వేమన నీతి పద్యాలూ

దాశరథీ కరుణాపయోనిధీ:

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ.

భావం:

యుద్ధమునందు భయంకరుడు, దుఃఖితులకు జుట్టము, ధనుర్విద్యయందును, భుజబలము నందును పేరు గన్న రాముని వంటి దేవుడింకొకడు లేడు. ఈ విషయము నేను లోకమునకు జాటెదను.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకము :

1వ పద్యం

నిను సేవింపగ నాపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ, మహాత్ము డననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా!

భావం:

ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! నేను నిన్ను సేవించుచున్నప్పుడు, నాకు ఆపదలే రానీ, లేక సుఖములు కలగనీ, సామాన్యమానవుడు అని జనులు అనుకొననీ లేక మహాత్ముడు అని పొగడనీ, సంసారము మీద మోహము కలగనీ లేక వైరాగ్యమబ్బనీ, గ్రహములు అద్దము తిరగనీ లేక మంచి జరగనీ అవి నాకు మంచే చేయునని భావించెదను.

2వ పద్యం

ఏ వేదంబు పఠించె లూత? భుజంగ బే శాస్త్రముల్ సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చెగరి; చెంచే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు; నీ పాద సం
సేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

భావం:

ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! సాలెపురుగు ఏ వేదములు పఠించినది? పాము ఏ శాస్త్రములు చదివినది? ఏనుగు ఏ విద్యలు నేర్చినది? బోయవాడు ఏ మంత్రములు నేర్చినాడు? వేదవిద్యాతతులవల్లనా ప్రభో మోక్షము సాధింపదగినది? నీ పాద సేవాసక్తి ఉన్న చాలదా?

3వ పద్యం

నీకున్, మాంసము వాంఛయేని కఱవా? నీ చేత లేడుండగా
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!

భావం:

ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మాంసమే నీకు రుచించిన, నీకేమి కఱువు? నీ చేతియందు లేడి కలదు. ఇంకొక చేతియందు వాడియైన కుఠారమున్నది. ముఖమున అగ్నిలీను కన్ను ఉన్నది. తలపై గంగ ఉన్నది. ఈ సామగ్రి గల నీవు శుచిగా వండుకొని నీ చేతిలోనే ఉన్న పుఱ్ఱెలో తినక ఒక బోయవాని ఎంగిలికూటినేల తగొంటివి? (భక్త పరాధీనుడవైన నీకు ఇది ఆ బోయయందు కల వాత్సల్యమే కాని మఱొండు కాదని కవి నిందాస్తుతి.)

4వ పద్యం

రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్‌
బాసీపాయదు పుత్త్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్‌
కోసీకోయదు నా మనంబకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్‌
చేసీచేయదు దీనిత్రుళ్ళణఁపవే శ్రీకాళహస్తీశ్వరా!

భావం:

ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీరతియందు, పుత్రామిత్రబాంధవులయందు నాకు తనివితీరినట్టే ఉండి మరల మరల కలుగుచున్నది. ఇటువంటి మనస్సును నాకు ఎందుకు ప్రసాదించితివి. నీ సేవానుతినతిసపర్యలు చేసి కూడా వాటిమీద మనస్సు నిలువదే. ఈ సంసారబంధలతలను వేగముగా త్రెంపి నన్ను కాపాడు ప్రభో!

5వ పద్యం

పవి పుష్పంబగు నగ్నిమంచగు నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుండతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా!

భావం:

ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వజ్రాయుధము కూడా పుష్పమాలికవుతుంది, అగ్ని మంచులా మారుతుంది, సముద్రము నేలగా పరిణమిస్తుంది, అత్యంతశత్రువు మిత్రుడవుతాడు, విషము ఆహారమౌతుంది కదా ప్రభో “శివ శివా” అని సదా నీ నామ సంస్మరణము చేయువానికి సర్వమూ వశ్యమవుతుంది.

6వ పద్యం :

పాలున్ బువ్వయుఁ బెట్టెదన్ గుడవరా పాపన్న రాయన్న లే
లే లేమ్మన్న నరంటిపండు కొని తే లేకున్న నొల్లనం
టే లాలింపరే తల్లితండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీ లీలావచనంబులన్ మనుపవే శ్రీకాళహస్తీశ్వరా!

భావం:

ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! చిన్నపిల్లలు పాలు, అన్నము తెచ్చి తినమంటే, కాదు అరటిపండు కావాలని ఎలా మారాం చేస్తారో, అదే విధముగా నేను కూడా నాకు ఇచ్చిన ఇహలోక సౌఖ్యములను వద్దని మోక్షమార్గము కోసము నిన్ను వేడితిని. తల్లితండ్రులు ఏ విధముగా ఆ మొండి బాలుని కోరికను తీరుస్తారో అదే విధముగా నీవు నన్నుద్ధరించు ప్రభో

7వ పద్యం :

కేదారాది సమస్త తీర్థములు కోర్కిం జూడఁ బో నేటికిన్
గాదా ముంగిలి వారణాసి కడుపే కైలాసశైలంబు నీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞాన ల
క్ష్మీ దారిద్ర్యులు గారే లోకులటా శ్రీకాళహస్తీశ్వరా!

భావం:

ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీ ధ్యానము మనస్సులో కలిగినప్పుడే ఇంటి ముంగిలి కాశీ క్షేత్రము కాదా? కడుపే కైలాసము కాదా. ఇది చేయక కేదారాది పుణ్య క్షేత్రములు సేవించుటకు పోవుదురే అజ్ఞానజనులు?

పద్యం :

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!

పద్యం :

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

భావం:

ప్రయత్నం చేయుట వలన ఇసుక నుంచి తైలం తీయవచ్చును. ఎండమావిలో నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు

ఇవి కూడా చూడండి :

నీతి పద్యాల లిస్ట్     వేమన పద్యాలు    సుమతీ శతక పద్యాలు   మహాభారతం పుస్తకాలూ   సకలదేవత స్తోత్రాలు    ఆధ్యాత్మిక పుస్తక నిధి   సనాతన ధర్మ మూలాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *