నీతి పద్యాలు సుమతీ శతక పద్యాలు 1-10

వేమన నీతి పద్యాలూ

సుమతీ శతక పద్యాలు :

1వ పద్యం

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ

భావం:

కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజగుణము నేలాగున మానలేదో, ఆ విధముగనే అల్పుడైనవానికి ఎంత గౌరవము చేసి మంచి పదవొసంగినను తన నీచత్వమును వదలనేరడు.

2వ పద్యం

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్‌
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ

భావం:

చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములకు నివాసమైనంట్లు, అజ్ఞానుడు కూడబెట్టిన బంగారమంతయు రాజుల వశమైపోవును.

3వ పద్యం

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ?

భావం:

బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు.

4వ పద్యం

ఆకొన్న కూడె యమృతము,
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన్‌,
సోకోర్చువాడె మనుజుడు,
తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ

భావం:

లోకమునందు ఆకలి సమయమున అన్నమే అమృతము. బాధ నొందకుండా నిచ్చువాడే దాత. ఆవేశమును ఓర్చుకొనువాడే మానవుడు. ధైర్యం కలవాడే వంశ శ్రేష్టుడు.

5వ పద్యం

అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ

భావం:

అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెఱవేర్చని భగవంతుని, యుద్ధసమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టవలయును.

6వ పద్యం

పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

భావం:

పిలవని కార్యక్రమాలకు వెళ్లడం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయదగదు.

7వ పద్యం

కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ

భావం:

భార్యతోడ నెప్పుడును జగడములాడవలదు. లేని నేరములు ఆరోపింపవలదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటనీరు క్రిందపడిన నాయింట లక్ష్మి నిలవదు.

8వ పద్యం

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ

భావం:

ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు

9వ పద్యం

ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌,
మడువున గొక్కెర యుండదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ

భావం:

ఉడుము నూరేండ్లును, పాము పదివందల ఏండ్లును, కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి. వాని జీవితములన్నియు నిరుపయోగములు. మానవుని జీవిత మట్టిదికాక ధర్మార్ధకామ మోక్షాసక్తితో కూడినది కావలెను.

10వ పద్యం

తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ

భావం:

తన కోపమే తనను శత్రువులువలె బాధించును. తన శాంతమే తనను రక్షించును. తన దయయే తనకు చుట్టమువలె సహాయపడును. తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము.

ఇవి కూడా చూడండి :

నీతి పద్యాల లిస్ట్     సుమతీ శతక పద్యాలు 11-20     వేమన పద్యాలు     శ్రీకాళహస్తేశ్వరా శతకం     సకలదేవత స్తోత్రాలు    సనాతన ధర్మ మూలాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *