సుమతీ శతక పద్యాలు నీతి పద్యాలు 11-20

వేమన నీతి పద్యాలూ

సుమతీ శతక నీతి పద్యాలు :

11వ పద్యం :

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ

భావం:

కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత తమ మిత్రుడైన సూర్యుని యొక్క ఎండ తాకుడుకే కమలుచున్నవి. అట్లే మానవులు తమ తమ నివాసములను విడిచి పెట్టినచో తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు.

12వ పద్యం :

కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్‌
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ

భావం:

చెఱకుగడ చివర వెన్ను పుట్టినచో ఆ చెఱకునందలి తీయదనము నంతయు నేవిధముగ పాడుచేయునో ఆ విధముగనే అప్రయోజకుడైన కుమారుడు కలిగిన కుటుంబమునకుపయోగకారి కాకపోవుట యటుండగా తండ్రి మంచిగుణమును కూడా పాడుచేయును.

13వ పద్యం :

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ

భావం:

చెరువునిండా నీరుచేరగనే వేలకొలది కప్పలందులోనికి ఏ విధముగా చేరుకొనునో, సంపద కలిగిన బంధువులెక్కువగా జేరుకొందురు.

14వ పద్యం :

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ

భావం:

మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములు లెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు

15వ పద్యం :

ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్‌,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ

భావం:

ఇంపుగా పఠింపని నోరును, అమ్మయని పిలచి అన్నము అడుగనినోరును, తమ్ముడాయని పిలువని నోరును, కుమ్మరివాడు మన్నుత్రవ్విన గోయీవంటిది సుమా.

16వ పద్యం :

అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ

భావం:

ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండా ప్రవహించు నదియును, బ్రాహ్మణుడుగల గ్రామమునందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమునందు నివసింపకుము.

17వ పద్యం :

అప్పు కొని చేయు విభవము,
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్‌,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ

భావం:

ఋణము దెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనమందు పడుచు భార్య, తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును.

18వ పద్యం :

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

భావం:

కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది.

19వ పద్యం :

సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

భావం:

సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.

20వ పద్యం :

లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!

భావం:

పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.

ఇవి కూడా చూడండి :

నీతి పద్యాల లిస్ట్    సుమతీ శతక పద్యాలు 1-10      సుమతీ శతక పద్యాలు 21-30      శ్రీకాళహస్తేశ్వరా శతకం     వేమన పద్యాలు    సనాతన ధర్మ మూలాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *