యోగి వేమన నీతి పద్యాలు 21-30 | వేమన శతక పద్యాలు

వేమన నీతి పద్యాలూ

యోగి వేమన పద్యాలు

21వ పద్యం

తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు
పుట్టనేమి, వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం:

తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి

22వ పద్యం

తనకు లేనినాడు దైవంబు దూరును
తనకు గల్గెనేమి దైవమేల,
తనకు దైవమునకు దగులాట మెట్టిదో
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం:

మనిషి తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు. ఉన్నప్పుడు దేవుని మరచిపోతాడు. ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమోకదా!

23వ పద్యం

ధనము కూడబెట్టి దానంబు చేయక
తాను దినక లెస్స దాచుకొనగ
తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం:

ధనము సంపాదించి, దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును.

24వ పద్యం

వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలుపులు బోడులా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం:

వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా!

25వ పద్యం

ఉప్పులేనికూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం:

ఉప్పులేని కూర రుచిగావుండదు. పప్పులేని భోజనము బలవర్ధకముకాదు. అప్పులేనివాడే ధనవంతుడు.

26వ పద్యం

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తనతప్పులెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం:

ఇతరుల తప్పులను పట్టుకొనువారు, అనేకులు గలరు. కాని తమ తప్పులను తాము తెలుసుకొనలేరు

27వ పద్యం

మాటలాడు నొకటి మనసులోన నొకటి
ఒడలి గుణము వేరె యోచన వేరె
ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం:

మనసులో ఉన్నది ఒకటి, పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.

28వ పద్యం

శ్రీరామ యనెడు మంత్రము
తారకమని యెరిగి మదిని ధ్యానపరుండై
సారము గ్రోలిన నరునకు
చేరువగను పరమ పదము చేకూరు వేమా!

భావం:

శ్రీరామ నామము తారకమంత్రము. ఆ రామనామంలోని సారాన్ని గ్రహించి మనస్సులో ధ్యానం చేసినట్లయితే మోక్షం తప్పక లభిస్తుంది

29వ పద్యం

కఫము మీఱి మఱియుఁగనులు మూతలుపడి
బుద్ధి తప్పిచాల బుడమి మఱచు
వేళలందు నిన్ను వెదుకుట సాధ్యమా
విశ్వదాభిరామ వినురవేమ!

భావం:

మరణ సమయంలో కఫం నోటికి అడ్డుపడి మాటను రానీయదు, కనులు మూతపడిపోతూ ఉంటాయి. జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది. ఈ లోకాన్నే గుర్తించలేని స్థితిలో ఉండి పరమాత్ముడవైన నిన్ను వెదుకుట సాధ్యంకాదు. కనుక శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవంతుని ధ్యానించి పరమాత్మను చేరాలి.

30వ పద్యం

ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు బరమలుబ్ధు
పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం:

మూర్ఖుణ్ని మూర్ణుడే మెచ్చుకొంటాడు. అజ్ఞానియైన వాడు లోభివానినే మెచ్చుకుంటాడు. పంది బురదనే కోరుకుంటుంది. కాని పన్నీరును కోరుకోదు.

ఇవి కూడా చూడండి :

నీతి పద్యాల లిస్ట్     వేమన పద్యాలు 1-10    వేమన పద్యాలు 11-20    అష్టాదశ పురాణాలూ     సప్తచిరంజీవులు     1965-2020 వరకు గల పంచాంగాలు    సకలదేవత స్తోత్రాలు    శ్రీకాళహస్తేశ్వరా శతకం    సుమతీ శతక పద్యాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *